CM Jagan, Pawan Kalyan and Governor Biswabhushan reached Visakhapatnam
mictv telugu

ప్రధాని కోసం విశాఖ చేరుకున్న ముగ్గురు రాష్ట్ర ప్రముఖులు

November 11, 2022

ఏపీలోని ప్రముఖ నగరమైన విశాఖపట్టణానికి ప్రధాని మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం శుక్రవారం వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌‌లు స్వాగతం పలికారు. స్వాగతం అనంతరం ప్రధాని మారుతి జంక్షన్‌‌లో ఒకటిన్నర కిలోమీటర్ల మేర నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు. ఇందుకోసం బీజేపీ శ్రేణులు భారీగా విశాఖకు తరలివచ్చాయి.

రోడ్ షో అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌తో రాత్రి 8.30 గంటలకు చోళ సూట్‌లో ప్రధాని భేటీ అవుతారు. ఇప్పటికే వైజాగ్ వెళ్లిన పవన్ కల్యాణ్, తాజాగా చోళ సూట్‌కు చేరుకున్నారు. అంతకుముందు ఎయిర్ పోర్టులో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్.. బస చేసే హోటల్‌‌కి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే శనివారం ప్రధాని పాల్గొనే బహిరంగ సభలో వేదికపై ఎనిమిది మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ప్రధానితో పాటు సీఎం, గవర్నర్, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్సీలు వాకాటి నారాయణ రెడ్డి, పీవీఎన్ మాధవ్ మాత్రమే ఉంటారని అధికారికంగా వెల్లడైంది. సభలో ప్రధాని 40 నిమిషాలు ప్రసంగించనుండగా, సీఎం జగన్‌‌కు ఏడు నిమిషాలు కేటాయించారు. రైల్వే మంత్రి సభకు అధ్యక్షత వహిస్తారు. కాగా, అధికారిక కార్యక్రమానికి వచ్చిన మోదీ.. పవన్ కల్యాణ్‌‌తో భేటీ అవనుండడం చర్చనీయాంశంగా మారింది.