ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి జగన్ ప్రభుత్వం అభాసుపాలైన విషయం తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన ఏపీలో చర్చనీయాంశంగా మారింది. సర్వే రాళ్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండటంతో అధికారులు వాటిని తొలగించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సమీక్షలో ఒంగోలు గ్రానైట్ రాళ్లను అధికారులు పక్కనపెట్టారు. జగ్గయ్యపేట రాళ్లను తెప్పించి సంబంధిత శాఖ అధికారులు సీఎం జగన్కు చూపించారు. ప్రకాశంజిల్లాలో పేరుమోసిన చీమకుర్తి గ్రానైట్ రాయిపై జగన్ బొమ్మలను చిత్రించి ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు.
నాలుగు అడుగుల పొడవు ఉన్న ఒక పెద్ద రాయిపై ఏపీ ప్రభుత్వ గుర్తును చిత్రీకరించారు. అదే రాయిపై ఒక వైపున బాణం గుర్తు, మరోవైపున సమగ్ర భూ సర్వే 2021 అని రాయించారు. మరో రాయిని ప్రత్యేకంగా సీఎం జగన్ బొమ్మతో డిజైన్ చేయించారు. కాగా, జగన్ను చరిత్రలో చిరస్థాయిగా నిలిపేలా సర్వే అధికారులు రాళ్లపై జగన్ బొమ్మలను ఏర్పాటుచేశారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే సమగ్ర భూసర్వేలో జగన్ బొమ్మలతో కూడిన సరిహద్దు రాళ్లను డిజైన్ చేయించారు.