Cm Jagan Released Amma Vodi Scheme Funds In Srikakulam District
mictv telugu

రూ.2 వేలు తక్కువైతే ఇంతగా విమర్శిస్తారా? ‘అమ్మఒడి’పై జగనన్న

June 27, 2022

 

తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మనిషి తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని.. చదువుపై పెట్టే ప్రతి రూపాయి వారికి పదింతలు మేలు చేస్తుందని పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన జగన్.. ‘అమ్మఒడి’ పథకం మూడో విడత కింద రూ.6,595కోట్ల నిధులను విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లోకి విడుదల చేశారు.

43 లక్షల 96 వేలమంది తల్లుల ఖాతాల్లో నేరుగా ఈ సొమ్మును జమ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అమ్మ ఒడి స్కీం ద్వారా గత మూడేళ్లలో అక్క చెల్లెమ్మల ఖాతాలలో మొత్తం రూ.19,618 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రతి తల్లి తమ బిడ్డలను మంచిగా చదివించాలని తాపత్రయపడుతుందని.. అలాంటి వాళ్లకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం జగన్ అన్నారు. అమ్మ ఒడి , నాడు నేడు , విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలను అమలు చేస్తున్నామని.. ఇటీవల బైజూస్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల విద్యలో మరింత నాణ్యత పెరుగుతుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే టాయ్‌లెట్లు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యమని.. అందుకే అమ్మ ఒడి ద్వారా ఇచ్చే నిధుల్లో కొన్ని నిధులను టాయ్‌లెట్ మెయింటెన్స్ ఫండ్ (TMF) కింద రూ.2వేలు కోత విధించాల్సి వస్తోందన్నారు. కానీ రూ.2వేల కోసం కొందరు నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నారు. పిల్లలకు ఏనాడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వని వాళ్లు ఈరోజు ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.