జగన్ మరో సంచలనం.. ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు  - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ మరో సంచలనం.. ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు 

October 17, 2019

Cm Jagan Review Meet APPSC

ఉద్యోగాల భర్తీలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఏపీ సీఎం జగన్ కూడా అవలంబిస్తున్నారు. గతంలోనే కేంద్రం కింది స్థాయి ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను తొలగించింది. ఇంటర్వ్యూల్లో పక్షపాతం, లంచాలు వంటి అవకతవకలకు తావులేకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే విధంగా ఏపీపీఎస్సీ చేపట్టే ఉద్యోగాల భర్తీలోనూ.. ఇంటర్వ్యూలు తొలగించాలని జగన్  కీలక నిర్ణయం తీసుకున్నారు. 2020 సంవత్సరం జనవరిలో విడుదల కాబోయే ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌పై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ ప్రక్రియకు స్విస్తి చెప్పాలని ఆదేశించారు. 

జగన్ తాజా నిర్ణయంతో ఇక నుంచి కేవలం రాత పరీక్షల్లో మెరిట్‌ ఆధారంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్‌లు చాలా వరకు కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన పారదర్శకంగా నిర్వహించేందుకు ఇంటర్వ్యూ విధానాన్ని పక్కన పెట్టాలని సూచించారు. ఉద్యోగ నియామకాలు ఇక నుంచి మరింత పారదర్శకంగా జరగాలని చెప్పారు. 

కాగా ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ముందుగా అత్యవసర విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునే ఆలోచనపై అధికారులతో చర్చించారు. ఏపీ సీఎం తాజా నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.