CM Jagan started bio ethanol plant in east godavari district
mictv telugu

బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్

November 4, 2022

ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. గోకవరం మండలం గుమ్మళ్ల దొడ్డి వద్ద రూ. 270 కోట్లతో నిర్మించే బయో ఇథనాల్ ప్లాంటుకు ఆయన భూమి పూజ చేశారు. అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటు ద్వారా రైతులకు మేలు జరుగనుంది. బ్రోకెన్ రైస్ అంటే నూకలు, వ్యవసాయ వ్యర్ధాలతో ఇథనాల్ తయారు చేయనున్నారు. దీని వల్ల ఉప ఉత్పత్తులైన పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగించే ప్రొటీన్ ఫుడ్ అందుబాటులోకి వస్తుందని జగన్ వెల్లడించారు. రంగు మారిన ధాన్యానికి కూడా మంచి ధర వస్తుందని తెలిపారు. 2 లక్షల లీటర్ల సామర్ధ్యంతో ప్లాంట్ ఏర్పాటు అవుతోందని, ఆరు నెలల్లో అనుమతులు మంజూరు చేసి భూమి పూజ చేస్తున్నామన్నారు. టెక్ మహీంద్ర సీఈవో సీపీ గుర్నానీ కుమారుడు అశీష్ గుర్నానీ ఆధ్వర్యంలోని కంపెనీ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని, దీని వల్ల 500 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అనంతరం అశీష్ గుర్నానీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏపీ ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమండ్రికి దగ్గరలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కులో 20 ఎకరాల్లో ఈ గ్రీన్ ఫీల్డ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.