సీఎం జగన్ నేడు తెనాలిలో పర్యటించారు. మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల చేశారు. మూడో విడత కింద 51.12 లక్షల మందికి రూ. 1.090.76 కోట్లు జమ చేశారు.
వరుసగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నట్లు జగన్ తెలిపారు. అలాగే తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా ఏటా 13,500 భరోసా అందిస్తున్నామన్నారు.
విపక్షాల పై ఫైర్
విపక్షాలపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతోపాటు, దత్తపుత్రుడంటూ పవన్ కళ్యాణ్‌ను దుమ్మెత్తిపోశారు. “రైతులకు మేలు చేస్తుంటే టీడీపీకి కడుపు మండుతోంది. ఆ మంటకు మందే లేదు. దోచుకో.. పంచుకో.. తినుకో.. అనేలా టీడీపీ పాలన ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బడ్జెట్ ఉంది. కానీ ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు అందించలేదు. రాష్ట్రంలో ఈరోజు యుద్ధం జరుగుతోంది. కరువుతో స్నేహం చేసిన చంద్రబాబతో మీ బిడ్డ వచ్చే ఎన్నికల్లో యుద్ధం చేయబోతున్నాడు. రాష్ట్రంలో గజ దొంగల ముఠా ఉంది. ముఠాకు దత్తపుత్రుడు తోడయ్యాడు. మీకు నా హయాంలో మంచి జరిగింది అనిపిస్తే తోడుగా ఉండండి” అంటూ సీఎం జగన్ తెలిపారు.
175 స్థానాల్లో పోటీ చేయాలి
తెనాలి వేదికగా చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు, పవన్ 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో చెప్పే మాయమాటలను నమ్మొద్దని జగన్ సూచించారు.