ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీతో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాల గురించి సీఎం ప్రధానికి వివరించినట్టు సమాచారం. అలాగే త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల విషయం గురించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత జగన్ వెంటనే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పది నిమిషాలు సమావేశమయ్యారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పన్నుల రాబడి, అప్పులు, కేంద్రం నుంచి సహకారం వంటి విషయాలు మంత్రికి సీఎం వివరించారు. తర్వాత రాత్రి హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. కాగా, ఈ పర్యటన విషయంలో ప్రతిపక్ష టీడీపీ పార్టీ వైఎస్ జగన్‌కు కొన్ని సూచనలు చేసింది. రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి బలం సరిపోదు కాబట్టి వైసీపీ తన మద్ధతునిచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరింది. ప్రత్యేక హోదా, పోలవరం అంచనాల సవరణ, రెవెన్యూ లోటు భర్తీ వంటి విషయాలపై వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకొని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని అభిప్రాయపడుతున్నారు.