బస్సులపై ఫోటో వేసుకోవాల్సిన అవసరం నాకులేదు..సీఎం కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

బస్సులపై ఫోటో వేసుకోవాల్సిన అవసరం నాకులేదు..సీఎం కేసీఆర్

February 4, 2020

Cm kcr.

టీఎస్ ఆర్టీసీలో కార్గో సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొని వచ్చిన సంగతి తెల్సిందే. అయితే కార్గో బస్సులపై కేసీఆర్ ఫోటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. 

ఆర్టీసీ బస్సులను సరకు రవాణాకు ఉపయోగించడం వల్ల సంస్థ లాభాల్లో పయనిస్తుందని సీఎం తెలిపారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలి తప్ప చౌకబారు ప్రచారం పొందాలనుకోవడం తమ అభిమతం కాదన్నారు. కాగా, కార్గో బస్సులపై సీఎం కేసీఆర్ ఫోటో వేయరాదని ఆర్టీసీ ఎండీకి సీఎంవో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి లేఖ రాశారు.

2020 జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఒక్కోబస్సు ఇంచుమించు 7 టన్నుల సరుకు మోసే సామర్థ్యం కలిగినదిగా సిద్ధం చేశారు. ప్రస్తుతానికి వాటిని ‘తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీసు’ అన్నపేరును వినియోగిస్తున్నారు. సరుకు రవాణా బస్సులకు పూర్తిగా ఎర్ర రంగు ఉండగా.. వాహనం వెనకవైపు కొంతమేర క్రీమ్ కలర్ ఉంటుంది. ప్రైవేట్ ఆపరేటర్లకు ధీటుగా పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. విస్తృతమైన నెట్‌వర్క్ ఉన్నందున ఖచ్చితంగా విజయం సాధిస్తామని.. అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.