పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ ఈరోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు పంజాబ్ సీఎం నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర అధికారులు .. భగవంత్‌సింగ్, ఆయన బృందానికి వివరించనున్నారు. పర్యటనలో భాగంగా మొదట కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్కూక్‌లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ను సందర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్య ప్రవహించే కూడవెళ్లి వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువును సందర్శిస్తారు.
గురువారం ఉదయం 10 గంటలకు భగవంత్‌సింగ్ మాన్ హైదరాబాద్ నుంచి కొండపోచమ్మ సాగర్ కు బయలుదేరుతారు. రోడ్డు మార్గంలో 11 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు.11 గంటల నుంచి 11.30 గంటల వరకు కొండపోచమ్మ సాగర్ ను, పంప్ హౌస్ ను సందర్శిస్తారు. అనంతరం 11.40 గంటలకు ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్యనున్న చెక్ డ్యాంను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువుకు చేరుకొని మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధిని పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు.