జగన్‌కు అన్నం పెట్టి మాట్లాడితే, గిచ్చి కయ్యం పెట్టుకున్నాడు.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌కు అన్నం పెట్టి మాట్లాడితే, గిచ్చి కయ్యం పెట్టుకున్నాడు.. కేసీఆర్

August 10, 2020

CM KCR angry on ap cm jagan.. Pothireddypadu project issue.

సఖ్యంగా సాగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు చిచ్చు పెట్టిందా అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమిష్టి నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాల అభ్యున్నతికి ఒకరికి ఒకరు సహకరించుకున్నారు. అయితే అది ఎక్కువకాలం నిలవకుండా నీటి యుద్ధం రాజుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు అన్నం పెట్టి మాట్లాడితే గిచ్చి కయ్యం పెట్టుకున్నాడని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇంతవరకు కేసీఆర్, జగన్‌ను ఉద్దేశించి ఇంత పెద్ద మాట అనలేదు. అలాగే ఏపీ ప్రభుత్వం అర్ధం పర్థం లేని నిరాధార ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. అనవసర రాద్దాంతానికి ఏపీ ప్రభుత్వం పోతోందని.. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానాలను అనుసరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అపెక్స్ సమావేశంలో ఇటు ఏపీకి, అటు కేంద్రాల నోరు మూయించాలని అధికారులకు సూచించారు. 

కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు దక్కిన వాటా ప్రకారమే ప్రాజెక్టులు కడుతున్నాం. సాగునీటి విషయంలో తెలంగాణకు తొలినుంచీ అన్యాయమే జరుగుతోంది. గోదావరి మిగులు జలాల్లో మరో 1000 టీఎంసీలు తెలంగాణకు దక్కాలి. సముద్రంలో కలిసే 2వేల టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలి అన్నాం. బేసిన్లు, భేషజాలు లేకుండా ఏపీకి స్నేహ హస్తం అందించాం. జగన్‌ను ఇంటికి పిలిచి అన్నంపెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల కోసం ప్రాజెక్టులు కట్టుకుందామని చెప్పాను. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లిద్దామని అన్నాను. అయినా ఏపీ ప్రభుత్వం గిచ్చి కయ్యానికి కాలు చాపుతోంది. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం తగదు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఏలేశ్వరం వద్ద కట్టాల్సిందని కేసీఆర్ అన్నారు.  వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులను నింపాలని అన్నారు. అలాగే శ్రీశైలం కేవలం జల విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే అని స్పష్టంచేశారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల విషయంలో కేంద్రం అభ్యంతరాలు చెబుతోందని.. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం వైఖరి బాగాలేదని అన్నారు.