కొండగట్టు అంజన్నకు సీఎం కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేశారు. జగిత్యాల జిల్లాలోని మోతెలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే జగిత్యాల జిల్లా ఏర్పడిందని కేసీఆర్ పేర్కొన్నారు.
జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాక.. అద్భుతమైన కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. జగిత్యాల ఇలా అభివృద్ధి చెందుతుందని కలలోకూడా అనుకోలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బండలింగూపూర్ను మండల కేంద్రం చేస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. తెలంగాణలో అద్భుత పుణ్యక్షేత్రాలు ఉన్నాయని వివరించారు. కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు అంజన్న దేవాలయంతో పాటు పలు పుణ్యక్షేత్రాలు ఉన్నట్లు తెలిపారు. కొండగట్టు అంజన్న సన్నిధికి హనుమాన్ భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారని చెప్పారు. కేవలం 20 ఎకరాల్లో ఉన్న అంజన్న దేవస్థానంకు 384 ఎకరాల స్థలాన్ని దేవాలయానికి ఇచ్చినట్లు తెలియేశారు. ఇప్పుడు అంజన్న క్షేత్రానికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. త్వరలోనే స్వయంగా వచ్చి సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తాను అని హామీ ఇచ్చారు.