cm kcr announced a compensation of 50 lakh rupees to the fro srinivas family
mictv telugu

శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎం కేసీఆర్

November 23, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం ఎర్రగూడ అటవీప్రాంతంలో గుత్తికోయల చేతిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు బలైన సంగతి తెలిసిందే. అటవీభూముల్లో పోడు వ్యవసాయం వివాదం నేపథ్యంలో గుత్తికోయలు కత్తులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లతో శ్రీనివాసరావుపై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన ఆయన ఆసుపత్రిలో మరణించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుత్తికోయల చేతిలో మరణించిన అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. డ్యూటీలో ఉన్నప్పుడు శ్రీనివాసరావుకు అందే జీతభత్యాలన్నీ పదవీవిరమణ వయస్సు వచ్చేదాకా ఆయన కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. శ్రీనివాసరావు పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. అంత్యక్రియల్లో పాల్గొనాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌ను సీఎం ఆదేశించారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎలాంటి జంకు లేకుండా విధులు నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.