ప్రపంచాన్ని ఆకర్షించే అద్బుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. నేడు కొండగట్టులో పర్యటించిన ఆయన హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలను విహంగ వీక్షణం ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు.తర్వాత ఆలయ అభివృద్ధిపై అధికారులతో రెండు గంటలపాటు సమీక్షించారు.
కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం ముందుగా కేటాయించిన రూ.100 కోట్లు కాకుండా మరో రూ.500 కోట్లు కేటాయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని దేశంలోనే గొప్పగా కొండగట్టులో జరుపుకోవాలన్నారు. వసతులు బాగుంటే ఆలయానికి భక్తులు తరలివస్తారని కేసీఆర్ తెలిపారు. సుమారు 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలని, పెద్ద గోడ, పార్కింగ్, పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరును అభివృద్ధిపర్చాలన్నారు.
ఆలయ పరిసరాల్లోని 86 ఎకరాల స్థలంలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా ప్రమాదాలు జరగకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు. వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేస్తుంటారని, అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు.