కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటించారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సతీసమేతంగా కేసీఆర్ పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన కేసీఆర్ దంపతులుకు ఆలయ పూజారులు, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని కేసీఆర్ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు.
ఆలయ అభివృద్ధికి రూ.7 కోట్లు
పూజలు అనంతరం తిమ్మాపూర్ కృతజ్ఞత సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. మన బాధలను తొలగించేందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి సాధించామని కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలొ సాగునీటి కోసం రైతులు పడ్డ ఇబ్బందులను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
బాన్సువాడకు రూ.50 కోట్లు
బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటి కోసం ఎన్నో పోరాటాలు చేశారని సీఎం తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక చిన్నపిల్లాడిలా కొట్లాడుతాడని కేసీఆర్ వెల్లడించారు. బాన్సువాడ కోసం రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులను ఉపయోగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పోచారంకు సీఎం సూచించారు.