దేశంలో త్వరలో రైతుల తుఫాన్ రాబోతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వస్తున్న తుఫాన్‌ను ఎవరూ ఆపలేరని తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్‌లో చేరిన వారికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోహ దారులన్నీ రైతులతో కిక్కిరిసిపోయాయని కేసీఆర్ తెలిపారు. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. 75 ఏళ్ళలో ఎన్నో పార్టీలు, సీఎంలు, పీఎంలు మారినా రైతుల తలరాత మారలేదని స్పష్టం చేశారు. 54 ఏళ్లు కాంగ్రెస్, 16 ఏళ్లు బీజేపీ ప్రభుత్వాలు, మళ్లీ ఇప్పడు బీజేపీ అధికారంలో ఉన్నా..పాలనలో తేడా కనబడలేదని వెల్లడించారు. కేవలం పార్టీలు, పార్టీ నాయకుల మాత్రమే లాభం చేకూరుతుందని కేసీఆర్ ఆరోపించారు. ప్రజలకు, రైతులకు ఏం దక్కిందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఒక్కసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రతి చోట గులాబీ జెండా ఎగుర వేయాలని ..అలాంటి తీర్పు ప్రజలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరకు వస్తుందని ..వాళ్లు ఎకరాకు 6వేలు ఇవ్వడం కాదు..10వేలు ఇస్తారంటూ చెప్పారు.
https://www.youtube.com/live/OsZDLygSLvI?feature=share
మహారాష్ట్రకు రాను
” మహారాష్ట్రలో కేసీఆర్‌కు ఏం పని అంటూ డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రశ్నిస్తున్నారు. భారత పౌరుడిగా ప్రతీ రాష్ట్రానికి వెళ్తా. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడ్నవీస్ చేస్తే నేను మహారాష్ట్ర రాను. తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు నేను వస్తూనే ఉంటా. అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్రలో దళితబంధు అమలు చేయాలి. మహారాష్ట్ర రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తెలంగాణలో ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నాం. తెలంగాణలో రైతులకు రూ.5లక్షల రైతుబీమా ఇస్తున్నాం. పూర్తిగా పంట కొంటున్నాం” అని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్‌తో లాభం లేదు
” నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి రూ.10వేలు ఇచ్చే వరకు కొట్లాడుతాం. దేశంలో సమృద్ధిగా సహజ వనరులున్నాయి. దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటలు సులభంగా విద్యుత్ సులభంగా ఇవ్వొచ్చు. 125 ఏళ్ల పాటు విద్యుత్ ఇచ్చేంత బొగ్గు మన దగ్గర ఉంది. అయినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోతున్నారు. ఏటా 50వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నిధులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరుగట్లేదు” అని కేసీఆర్ ప్రశ్నించారు.