బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఖమ్మం నగరం సర్వసన్నద్ధమైంది. ఎటు చూసినా నగరమంతా గులాబీమయమైంది. జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే విధంగా తొలి బహిరంగ సభ జరుగనుందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు తెలిపారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సభా వేదికగా సమరభేరి మోగిస్తామని.. అంటున్నారు. దేశమంతటా తెలంగాణ విధానాల అమలే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ సభలో పలువురు జాతీయ నేతలు.. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, , ఒక మాజీ ముఖ్యమంత్రి, పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
ఈ సభ గురించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… ” ఖమ్మం సభ ఒక చరిత్రాత్మక సభ. ఇందులో నాలుగు జాతీయ పార్టీలు పాల్గొంటున్నాయి. ఆప్ పార్టీ వ్యవస్థాపకులు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్, యూపీ సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ అధ్యక్షులు డీ. రాజా, సీపీఎం తరఫున ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొంటున్నారు. నాలుగు జాతీయ పార్టీలను ఒక వేదికై తీసుకురావడం.. ఇదే మొదటిసారి.. కేసీఆర్ తొలి విజయం సాధించారు.” అని తెలిపారు.
బుధవారం ఉదయం.. మూడు రాష్ట్రాల(ఢిల్లీ, పంజాబ్, కేరళ) ముఖ్యమంత్రులు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్‌తో కలసి బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత యాదాద్రికి వెళ్లి అక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు. లక్ష్మీనర్సింహ స్వామి దర్శనం అనంతరం… యాదాద్రి నుంచి రెండు హెలీకాప్టర్లలో ఖమ్మంకు బయలుదేరి వెళ్తారు. నేరుగా సీఎం కేసీఆర్‌తో కలిసి వారంతా ఖమ్మం కలెక్టరేట్ చేరుకుంటారు. అక్కడ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత తెలంగాణలో చేపట్టే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడికి వచ్చిన ఆరుగురికి ఈ నేతలు అద్దాలు అందజేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభ జరుగుతుంది. ఆ తరువాత అదే హెలీక్యాప్టర్లలో జాతీయ స్థాయి నేతలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం వారి ప్రాంతాలకు జాతీయ నేతలు చేరుకుంటారు.
ఈ సభకు దాదాపు 13 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చేందుకు లక్షలాది మంది జనం పయనమయ్యారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, మధిర, ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి, సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి కూడా లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివస్తుండటంతో బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది.