కులం, మతం, జాతి, వర్గం అనే వివక్షలేని భారతావని కోసం మనమంతా ముందుకు సాగాలని కోరారు సీఎం కేసీఆర్. బుధవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తనను తాను ప్రేమించినట్లే.. పొరుగువారిని ప్రేమించాలని క్రీస్తు చెప్పారని తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు పాటిస్తే అందరం గొప్పవాళ్లమవుతామని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత పురోగమించినా.. క్రీస్తు బోధనలు అనుసరణీయమని వ్యాఖ్యానించారు. సంతోషకర సమాజం కోసం క్రీస్తుతో పాటు మరెందరో మహానుభావులు కృషి చేశారని, క్రీస్తు బోధనలు అందరూ పాటించి సంతోషకర జీవితాన్ని గడపాలని సూచించారు.
అన్ని మతాలను సమానంగా చూడటంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. తెలంగాణ సాధించిన పురోగతి దేశవ్యాప్తం కావాలని, ఆ దిశగా పోరాడేందుకు అందరి సహకారం కావాలని కోరారు. మానవీయ విలువల కోసం తెలంగాణ స్ఫూర్తితో దేశాన్ని బాగుచేసుకొందామని పిలుపునిచ్చారు. తెలంగాణ వలే భారత్ కూడా అభివృద్ధి చెందాలని, శాంతికాముక దేశంగా భారత్కు ఉన్న పేరు నిలబెట్టుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రైస్తవ పెద్దలతో సమావేశమవుతానని స్పష్టం చేశారు.