భూకంపం పుట్టిస్తాం, గోయల్ పరిగెత్తాల్సిందే.. కేసీఆర్ వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

భూకంపం పుట్టిస్తాం, గోయల్ పరిగెత్తాల్సిందే.. కేసీఆర్ వార్నింగ్

April 11, 2022

kcr

రెండు వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఢిల్లీలో ఆందోళన చేయడానికి కారణం ఎవరో కేంద్రం ఆలోచించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతులతో గొడవ పడడం మంచిది కాదని హితవు పలికారు. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీలు, మంత్రులతో పాటు రైతే ఉద్యమ నేత రాకేష్ టికాయత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..‘ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతుల పట్ల అవమానకరంగా మాట్లాడారు. మేమేమీ మిమ్మల్ని అడుక్కోవట్లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 30 లక్షల బోర్లు ఉన్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సాగురంగంలో వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత్ విద్యుత్తు వంటి పరిణామాలతో వరి దిగుబడి భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యల వల్ల తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని కేంద్ర పెద్దలు గుర్తుంచుకోవాలి.’ అని వ్యాఖ్యానించారు. ఉద్యమంతో భూకంపం పుట్టిస్తామని, గోయల్ పరగులు తీయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. హిట్లర్, నెపోలియన్ వంటి నియంతలే మట్టిగొట్టుకుపోయారని, కేంద్రం ఈ విషయాన్ని గుర్తించుకోవాలని అన్నారు.