హైదరాబాద్లో శీతాకాలం విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu) తెలంగాణ గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి పర్యటన పుణ్యాన వీరిద్దరు ఒకరితో ఒకరు మాటలు కలిపారు. ఆ తర్వాత రాష్ట్రపతితో ప్రముఖుల పరిచయ కార్యక్రమంలో కూడా తమిళిసై, కేసీఆర్ ఒకే వేదికపై కనిపించారు. చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్, గవర్నర్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి రేగింది. వారిద్దరి మధ్య కోల్డ్ వార్ ముగిసినట్టే అనుకున్నారు. కానీ మళ్లీ ఎప్పటిలాగే.. రాజ్భవన్లో రాష్ట్రపతికి గవర్నర్ ఇస్తున్న విందుకు మాత్రం కేసీఆర్ దూరంగా ఉన్నారు.
శీతాకాల విడిది కోసం తెలంగాణకు వచ్చిన సందర్భంగా రాజ్భవన్లో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై విందు ఇచ్చారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో రాజ్ భవన్కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ సాదరంగా స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ మాత్రం హాజరుకాలేదు.
అంతకుముందు కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు నిర్వహించారు. గవర్నర్ తమిళిసై ఇచ్చిన తేనీటి విందుకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు కానీ.. ముఖ్యమంత్రి మాత్రం వెళ్లలేదు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగకు కూడా గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రితోపాటు మంత్రులను ఆహ్వానించినా రాలేదు.