మహిళలు అన్ని రంగాల్లో పురోగమించినప్పుడే దేశాభివృద్ధి: సీఎం కేసీఆర్ - Telugu News - Mic tv
mictv telugu

మహిళలు అన్ని రంగాల్లో పురోగమించినప్పుడే దేశాభివృద్ధి: సీఎం కేసీఆర్

March 8, 2023

CM KCR extends International Women’s Day greetings to all women

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. మహిళలు అన్నిరంగాల్లో పురోగమించినప్పుడే దేశాభివృద్ధి సంపూర్ణం అవుతుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘యత్ర నార్యస్తు పూ జ్యంతే.. రమంతే తత్ర దేవతాః’ అనే ఆర్యోక్తికి అనుగుణంగా సామాజిక విలువలను మరింతగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు.

విభిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న అపూర్వ విజయాలు నారీశక్తిని చాటుతున్నారని కొనియాడారు. మహిళాశక్తిని చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. మహిళా సాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు, వారి గౌరవాన్ని పెంచుతూ, స్త్రీ జనోద్ధరణే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవును మంజూరు చేసి సమున్నతంగా గౌరవించుకుంటున్నామని తెలిపారు.

తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతున్నదని అన్నారు. ఆడపిల్లలు తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని వెల్లడించారు. మహిళల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు.