CM KCR gets Sir Chhotu Ram award for 2022
mictv telugu

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌ర్ ఛోటూ రామ్ అవార్డ్

January 6, 2023

CM KCR gets Sir Chhotu Ram award for 2022

తెలంగాణలో రైతుల అభివృద్ధికి చేసిన కృషికి గాను 2022 సంవత్సరానికి అఖిల భారత రైతు సంఘం అందించే ప్రతిష్టాత్మక సర్ ఛోటూరామ్ అవార్డును సీఎం కేసీఆర్ అందుకున్నారు.

వ్యవసాయ రంగం దేశంలోనే అత్యధిక ఉపాధిని కల్పిస్తున్నది. అందుకోసం అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు లాభసాటిగా మారుతుంది. ఇదే దిశగా మన సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఈ మాటలను మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతేకాదు.. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి సరికొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి భారతదేశాన్ని ప్రపంచానికి ధాన్యాగారంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చేస్తున్నారని తెలిపారు.

‘ఆహార ఉత్పత్తి, ప్రాసెసింగ్లో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ, వరసుగా వచ్చిన ప్రభుత్వాలు ఈ రంగాలను అన్వేషించడంలో విఫలమయ్యాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటంలో మరణించిన 700మందికి పైగా రైతులకు ఎటువంటి మద్దతు కూడా ఇవ్వలేదు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు అందించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు’ అని మంత్రి అన్నారు. పంజాబ్ కు చెందిన రైతు ప్రతినిధులు కూడా గడ్డు కాలంలో తమకు అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఎవరీ ఛోటూ రామ్..?

పంజాబ్ రైతులు ప్రధానంగా ఇద్దరు వ్యక్తులను ఆరాధిస్తారు. ఒకరు సర్ ఛోటూ రామ్, మరొకరు స్వామినాథన్. 1881లో బ్రిటీష్ ఇండియాలో పంజాబ్ ప్రావిన్స్‌లో సర్ ఛోటూ రామ్ ఝాట్ కుటుంబంలో జన్మించారు. యునైటెడ్ పంజాబ్ ప్రావిన్స్‌ను పాలించిన నేషనల్ యూనియనిస్ట్ పార్టీకి ఆయన సహా వ్యవస్థాపకుడు. నాడు కాంగ్రెస్, ముస్లింలీగ్‌ను తన పార్టీకి దూరంగా ఉంచారు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో పడి నలిగిపోతున్న నాటి పంజాబ్ రైతుల శ్రేయస్సు దృష్ట్యా సర్ ఛోటూ రామ్ 1934లో పంజాబ్ రిలీఫ్ అప్పుల చట్టం, 1936లో పంజాబ్ రుణదాతల రక్షణచట్టం తేవడానికి కృషిచేశారు. తదనంతర కాలంలో ఈ చట్టాలు పంజాబ్ రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాయి. ఆ తర్వాత హరితవిప్లవంతో స్వామినాథ‌న్ పంజాబ్ రైతులను గణనీయంగా ప్రభావితం చేశారు. ఆ తర్వాత తమను ప్రభావితం చేసిన వ్యక్తి కేసీఆర్ అని పంజాబ్ రైతులు మంత్రి నిరంజ‌న్ రెడ్డితో అన్నారు. అందుకే ఈ అవార్డు వారికి ఇస్తున్నట్లు పంజాబ్ రైతులు వెల్లడించారు.