Cm Kcr Goes To Munugode public Meeting in chanduru
mictv telugu

మునుగోడు సభకు సీఎం కేసీఆర్.. వెంట ఆ నలుగురు ఎమ్మెల్యేలు

October 30, 2022

మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌ బయల్దేరారు. చండూరు సమీపంలోని బంగారిగడ్డలో సీఎం సభకు టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో సభ మొదలుకానుంది. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. ఈ సభలో మునుగోడు అభివృద్ధిపై కేసీఆర్‌ ఎలాంటి కార్యచరణ ప్రకటిస్తారనేది ఓ అంశమైతే.. ఎమ్మెల్యేల బేరసారాలపై ఏం మాట్లాడుతారనేది మరో అంశంగా కనిపిస్తోంది.

మొయినా బాద్ ఫాం హౌస్ సాక్షిగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది బీజేపీ. ఉప ఎన్నిక వేళ ఇదే టీఆర్ఎస్ కు అస్త్రం కానుంది. టీఆర్ఎస్ విజయం దాదాపు ఖాయం అయిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కేసీఆర్‌ వెంట పైలట్‌ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు కూడా మునుగోడుకు బయల్దేరారు. ఈ సభలో సీఎం కేసీఆర్‌ మునుగోడు అభివృద్ధిపై కేసీఆర్‌ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారన్న దానితోపాటు సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్న దానిపైనా ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. మోదీ సర్కారు విధానాలపై పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారన్న చర్చ కూడా జోరుగా సాగుతున్నది. మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌ వచ్చే నెల 3న జరుగనుంది. అలాగే 6న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు అధికారులు.