CM KCR has decided to inaugurate the new Secretariat building on Ambedkar Jayanti: Report
mictv telugu

అంబేడ్కర్‌ జయంతి రోజే నూతన సచివాలయం ప్రారంభం.!!

February 14, 2023

CM KCR has decided to inaugurate the new Secretariat building on Ambedkar Jayanti: Report

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత సంకల్పించింది. ఈలోగా ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూలు విడుదల కావడంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో సెక్రటేరియట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇక నూతన సచివాలయ భవనానికి కొత్త ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అందరి అభీష్టం మేరకు అంబేడ్కర్‌ జయంతి(ఏప్రిల్‌ 14) రోజే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారట. అంబేడ్కర్‌ పేరుతో నిర్మిస్తున్న సచివాలయాన్ని ఆయన జయంతి రోజే ప్రారంభించాలని గతం నుంచీ డిమాండ్లు ఉన్నాయి. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో పాటు కొంత చర్చ కూడా నడిచింది. ఎలాగూ వాయిదా వేశాం కనుక… ఇక అంబేద్కర్‌ జయంతి రోజునే ప్రారంభిస్తే మేలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అందుకే ఏప్రిల్‌ 14న ఉదయం సచివాలయ ప్రారంభానికి ముహూర్తాన్ని ఖరారుచేసి, ఏర్పాట్లు చేయాలని అంతర్గతంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

సచివాలయ ప్రారంభానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, రాజ్యాగం నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనువడు ప్రకాష్ అంబేడ్కర్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలను సీఎం ఆహ్వానించారు. ముహూర్తాన్ని ఏప్రిల్‌కు మార్చిన నేపథ్యంలో మరోసారి వీరందరికీ ఆహ్వానాలు పంపాలని నిర్ణయించారు.