సీఎం కేసీఆర్ బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆ జిల్లాకు పలు వరాలు ప్రకటించారు. అందులో కొన్నింటికి స్టేజీపైనే నిధులను మంజూరు చేసి తన మాటను నిలబెట్టుకున్నారు. అలాగే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక వినతి మేరకు ఇచ్చిన మాటను ఒక్కరోజులోనే నెరవేర్చారు. మున్నేరు నదిపై పాత వంతెన స్థానంలో కొత్తది నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 180 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 420 మీటర్ల మేర ఉండే ఈ బ్రిడ్జీలో 300 మీటర్లు కేబుల్ వంతెన ఉండడం గమనార్హం. ఇది పూర్తయితే ఖమ్మం సిగలో మరో ప్రత్యేకత చేరినట్టేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక మాటిచ్చిన ఒక్కరోజులోనే నిలబెట్టుకున్న కేసీఆర్ నిబద్ధతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాక సభలో కేసీఆర్ జిల్లాకు పలు వాగ్దానాలు చేశారు. ప్రభుత్వ జేఎన్టీయూ కాలేజీ, ఖమ్మంకి రూ. 50 కోట్లు, మధిర, సత్తుపల్లి, వైరాలకు చెరో రూ. 30 కోట్లు, మేజర్ గ్రామపంచాయితీలు, జిల్లాలోని ప్రతీ గ్రామపంచాయితీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జర్నలిస్టులకు జిల్లా కేంద్రంలో నెలరోజుల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. మరి వీటిని ఎప్పుడు నెరవేరుస్తారో వేచి చూడాలి.