CM KCR held a huge public meeting in Peddapalli today
mictv telugu

నేడు పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ

August 29, 2022

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, గౌరెడ్డిపేట శివారులో పెద్దపల్లి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో నిర్మించిన పెద్దపల్లి జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్ నుండి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడ భోజనం చేసిన అనంతరం ఎమ్మెల్యే నివాసం నుండి టీఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకొని 2:40 గంటలకు నూతన తెలంగాణ భవన్ ను ప్రారంభిస్తారు.

ఇక‌.. 3 గంటలకు పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి 3:10 నిమిషాలకు నూతన కలెక్టరేట్ భవనానికి చేరుకుంటారు. జిల్లా సమీకృత భవనాల ప్రారంభోత్సవం అనంతరం 3:40 నిమిషాలకు బయలుదేరి 3:45 నిమిషాలకు కలెక్టరేట్‌ సమీపంలోని పెద్దకల్వలలో 50 ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడి బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభకు సుమారు లక్షమంది రానున్న క్రమంలో అందుకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సభకు వస్తున్న వారి కోసం 132 ఎకరాల్లో పార్కింగ్‌కు స్థలాన్ని కేటాయించారు అధికారులు.