మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని, నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ శాఖలన్నీ ఒకేచోట కొలువుదీరి ప్రజలకు పారదర్శక సేవలందించే లక్ష్యంతో అన్ని జిల్లాల్లో కొత్త సమీకృత కలెక్టరేట్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు అందుబాటులోకి రాగా.. నేడు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం చాంబర్లో కలెక్టర్ శశాంకను సీట్లో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దాయకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రాజయ్యతోపాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిథులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు.
మహబూబాబాద్ పర్యటన ముగియగానే సీఎం హెలికాప్టర్లో నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెళ్లనున్నారు. అక్కడ కూడా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని, నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ప్రకాశం స్టేడియం చేరుకుని హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్నారు.