హైదరాబాద్ నగరంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకేసారి నాలుగు వేలకు పైగా స్టార్టప్ కంపెనీలకు వసతి కల్పించేందుకు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్ ఫెసిలిటీ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. టీ హబ్-2 ప్రాంగణమంతా కేసీఆర్ కలియ తిరిగి.. టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ వెంట ఐటీ మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు టీహబ్-2 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్లోనే ఎంతో ప్రత్యేకత కలిగిన భవనంగా టీ హబ్ 2.0 నిలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో అత్యాధునిక డిజైన్‌తో సాండ్ విచ్ ఆకారంలో దీన్ని నిర్మించింది. టీ హబ్ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించారు.
స్టార్టప్ లకు ప్రోత్సాహం కల్పించేలా 2015లో టీ హబ్ ను రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు దానికి అనుబంధంగా సెకండ్ ఫేజ్ ను తీసుకొచ్చింది. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ–హబ్ ఫస్ట్ ఫేజ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దానికి మంచి రెస్పాన్స్ రావడం, విజయవంతమైందని సర్కార్ భావించడంతో భారీగా ఇప్పుడు టీ–హబ్ సెకండ్ ఫేజ్ ను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు.