CM KCR inaugurated Police Command and Control Center
mictv telugu

పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

August 4, 2022

రాష్ట్రానికే తలమానికంగా దేశానికే ఆదర్శంగా నగరంలో ఏర్పాటైన తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీఎస్‌ఐసీసీసీ)ను సీఎం కేసీఆర్ కాసేపటి క్రితం ప్రారంభించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ శిలాఫలకం వద్ద పూజలు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, సీపీ సీవీ ఆనంద్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు కమాండ్ కంట్రోల్‌ రూమ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ పరిశీలించారు.

 

బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్ 12లో ఏడు ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. 2016 నవంబర్‌ 22న ప్రారంభమైన కమాండ్‌ కంట్రోల్‌ భవన నిర్మాణ పనులు పూర్తవడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. గతంలో రెండుసార్లు ప్రారంభోత్సవానికి రెండుసార్లు ముహూర్తం నిర్ణయించినప్పటికీ పనుల ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు నేడు ఈ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.

 

ఆధునిక సాంకేతికతకు కేరాఫ్‌ అడ్రస్‌గా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిలించింది. ఈ సెంటర్‌లోనే నగర కమిషనరేట్‌ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌ బ్రాంచ్‌.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకువస్తున్నారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్‌ విండో విధానం అమలు కానుంది.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మొత్తం ఐదు టవర్లు ఉన్నాయి. టవర్‌ Aలో ఇరవై అంతస్తులను నిర్మించారు. ఇందులోనే సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. టవర్‌ A పైభాగంలో హెలిప్యాడ్ నిర్మించారు. టవర్‌ Bలో 15 అంతస్తులు ఉన్నాయి. ఇందులో టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉండనుంది. టవర్‌ Cలో మూడు ఫ్లోర్‌లు ఉన్నాయి. ఇందులో ఆడిటోరియంగా పోలీసులు వినియోగించనున్నారు. 18వ అంతస్తులో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం, 14వ అంతస్తులో గ్యాలరీని సీఎం ప్రారంభించారు.

టవర్‌ Dని మీడియా అండ్ ట్రైనింగ్ సెంటర్‌ కోసం ఉపయోగించనున్నారు. మొత్తం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టవర్ A, టవర్ B కీలకంగా ఉండనుంది. టవర్‌ Eలో కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్, సీసీ టీవీ మానిటరింగ్, వార్ రూమ్ ఉండనున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూచే వెసులుబాటు ఉంది. కమాండ్ కంట్రోల్‌ రూమ్‌లో ప్రత్యేక మ్యూజియం ఉండనుంది. పోలీస్ డిపార్టమెంట్‌ ఎలా పని చేస్తుందో తెలుసుకునే వెసులుబాటు ఉంది.