CM KCR inaugurated Ranga Reddy district collector building
mictv telugu

పంటలు కావాలా? మంటలు కావాలా? తేల్చుకోండి : కేసీఆర్

August 25, 2022

బంగారు పంటలు పండే తెలంగాణ కావాలా? లేక మత పిచ్చితో రగిలే మంటల తెలంగాణ కావాలా? మీరే తేల్చుకోండి అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భవన సముదాయాన్ని ఆయన కొంగరకలాన్‌లో ప్రారంభించారు. దాంతో పాటు జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘ప్రజలు చైతన్యవంతం కాకపోతే ఎంత నష్టపోతారో తెలంగాణే ఉదాహరణ. గతంలో మన నాయకత్వం చేసిన చిన్న పొరపాటు వలన తెలంగాణ 58 ఏళ్లు గోస పడింది. ఏపీ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. దీనికోసం ఎంతోమంది అమరులయ్యారు.

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రైతుబంధు, రైతు బీమా వంటివి ఎక్కడా లేవు. ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోతే వారం పదిరోజుల్లో అకౌంటులో పది లక్షలు పడుతున్నాయి. పంటలు మొత్తం ప్రభుత్వమే కొంటుంది. ఇవి కాపాడుకోవాలా? ఊడగొట్టుకోవాలా? ప్రజలే నిర్ణయించుకోవాలి. మంటలు మండే రాష్ట్రం కావాలంటే మన భవిష్యత్తు దెబ్బతింటుంది. నేను సీఎం అయినప్పుడే మోదీ ప్రధాని అయ్యారు. కానీ, మోదీ ఒక్క మంచి పని అయినా చేశారా? తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నప్పుడు దేశంలో ఎందుకివ్వరు. ఢిల్లీలో కరెంటు కాదు కదా. కనీసం మంచినీరు కూడా దొరకదు. దేశం బాగుంటే మనం కూడా బాగుంటాం. మన ఆదాయం కూడా పెరుగుతుంది. మోదీకి ప్రధాని పదవి చాలదా? బీహార్‌లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొడుతున్నారు. స్టాలిన్, మమతా, కేజ్రీవాల్ ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? అరాచకత్వమా? దీనికి సమాధానం కావాలి. ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి చెందుతోంది. మత పిచ్చిగాళ్లు దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. వారిని తరిమి కొట్టాలి. నేను బతికి ఉండగా, తెలంగాణను ఆగం కానివ్వను. నా బలం, బలగం ప్రజలే. నా శక్తి మొత్తం ధారపోస్తా. ఒక్కసారి దెబ్బతింటే వందేళ్లు నష్టపోతాం. లాఠీఛార్జీలతో ఏ రాష్ట్రం పురోగమించదు. కృష్ణా జలాల వాటా తేల్చేందుకు మోదీకి ఎనిమిదేళ్లు సరిపోలేదా? వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ప్రతీ ఎమ్మెల్యేకు అదనంగా రూ. 10 కోట్లను మంజూరు చేస్తున్నా’నంటూ ప్రసంగాన్ని ముగించారు.