త్వరలోనే అందుబాటులోకి నూతన సచివాలయం - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలోనే అందుబాటులోకి నూతన సచివాలయం

November 18, 2022

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. నూతన సచివాలయ భవనం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపొందుతున్నదని సీఎం అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం.. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగఫలితమేనని పేర్కొన్నారు. సచివాలయ ప్రాంగణంలో గంటన్నరపాటు ఉన్న కేసీఆర్‌.. పనుల గురించి ఇంజినీర్లను, అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. నూతన సచివాలయ నిర్మాణ పనులను దగ్గరుండి కేసీఆర్ పరిశీలించారు.
CM KCR inspects ongoing works of Telangana Secretariat complex

దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల మేర భవనాన్ని నిర్మిస్తున్నారు.సచివాలయ నిర్మాణ కోసం సిబ్బంది, కార్మికులు.. మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సుధీర్ఘకాలం రాష్ట్ర అవసరాలకు పనికొచ్చే విధంగా పటిష్ఠంగా నిర్మాణం చేస్తున్నారు. సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టారు. భవనం లోపల కలియతిరిగిన సీఎం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.తొలుత 6 లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించినా ప్రస్తుతం అది 8.60 లక్షల చదరపు అడుగులకు చేరింది. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు, ఇంజినీర్లకు సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు.

CM KCR inspects ongoing works of Telangana Secretariat complex

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సకల హంగులతో నిర్మిస్తున్న సచివాలయం త్వరలోనే ప్రారంభంకానున్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర సచివాలయం భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేర అందంగా రూపుదిద్దుకొంటున్నది. కొద్ది నెలల్లోనే ఇది ప్రారంభమవుతుంది’ అని మంత్రి కేటీఆర్‌ గురువారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.