రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరానికి శీతాకాల విడిది కోసం వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా శ్రీశైలం వెళ్లి వచ్చిన రాష్ట్రపతికి హకీంపేటలోని విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి వచ్చిన రాష్ట్రపతికి స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. వరుస క్రమంలో నేతలంతా వేదిక ఎక్కి వస్తూంటే.. వారికి సీఎం కేసీఆర్ పరిచయం చేయగా.. వారంతా స్వాగతం పలుకుతూ ముందుకు సాగారు. ఈ క్యూలో బండి సంజయ్ తో పాటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా ఉన్నారు.
వరుస క్రమంలో తర్వాత స్థానంలో ఉన్న బండి సంజయ్ వేదిక మీద రావడానికి తటపటాయిస్తుంటే సీఎం కేసీఆర్ స్పందించి బండి సంజయ్ ని రావాలంటూ సైగ చేశారు. ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రపతికి బండి సంజయ్ ని పరిచయం చేశారు. ఇదే తరహాలో కోమటిరెడ్డి వెంకట రెడ్డికి కూడా జరిగింది. అయితే నిత్యం రాజకీయంగా కేసీఆర్ పై నిప్పులు చెరిగే బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేసే కేసీఆర్ ఇద్దరూ ఒకే వేదికపై రావడం, రాష్ట్రపతికి పరిచయం చేయడంతో సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈ వీడియోను బండి సంజయ్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, విపరీతమైన కామెంట్లతో పాటు లైకులు కూడా వస్తున్నాయి.