CM KCR is furious , Center , 'bad propaganda on debts'
mictv telugu

‘అప్పులపై దుష్ప్రచారం చేస్తున్నారు’.. కేంద్రంపై మండిపడ్డ సీఎం కేసీఆర్

August 15, 2022

తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి వివరిస్తూనే, కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగవేత్తల స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటమే కాకుండా.. రాష్ట్రాల స్వేచ్ఛను కాలరాస్తూ దిల్లీలోని బీజేపీ సర్కారు నిరకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే.. దేశప్రజలు అన్నిరకాలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఎడాపెడా… పన్నుల భారం మోపడం.. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కొర్రీలు పెడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై కొందరు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని…. ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తుందని అవగాహనారాహిత్యంతోనూ, కుట్రపూరితంగానూ వ్యాఖ్యానిస్తున్నారని మండిప‌డ్డారు చట్టం పరిమితికి లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తోందని తెలిపారు.

దేశంలోని 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం కన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయని చెబుతూ.. జీఎస్‌డీపీలో తెలంగాణ రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23.5 శాతం కాగా, జిడిపిలో దేశం అప్పుల నిష్పత్తి 50.4 శాతం అని తెలిపారు. ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్ఆర్‌బీఎం చట్ట పరిమితుల్లోనే ఉన్నాయని, ఈ వాస్తవాన్ని గమనించకుండా బురదజల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.