సినిమా షూంటింగులకు కేసీఆర్ ఓకే.. జర జాగ్రత్త  - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా షూంటింగులకు కేసీఆర్ ఓకే.. జర జాగ్రత్త 

May 22, 2020

CM KCR is okay for movie shootings.. Be carefull

లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా అన్నీ రంగాలతో పాటు సినిమా షూటింగులు కూడా నిలిచిపోయాయి. దీంతో సినిమా రంగం మీద ఆధారపడ్డ సినీ కార్మికుల బతుకులు రోడ్డునపడ్డాయి. సినీ పెద్దలు వారిని ఆదుకోవడానికి తలా ఓ చేయి వేశారు కాబట్టి సరిపోయింది. ఇప్పటికే ముంబయి చిత్రసీమలో ఓ టీవీ నటుడు చేతిలో డబ్బులు లేక ఆత్మహత్య చేసుకోగా, ఓ సినిమా నటుడు పళ్లు అమ్ముకుంటున్నాడు. ఇదిలావుండగా తెలంగాణలో సినిమా షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. లాక్‌డౌన్ నిబంధనలు, కరోనా వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని కేసీఆర్ సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి  అధికారులను ఆదేశించారు. 

శుక్రవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున రీ ప్రొడక్షన్, షూటింగు నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని అన్నారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని తెలిపారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని కోరారు.