సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్న సీఎం… మొదట నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకు ముందు కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగుర వేశారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ధరూర్ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా.. సీఎం కేసీఆర్ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.119కోట్లు కేటాయించింది ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రజారోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జగిత్యాలలో మెడికల్ కాలేజీని ప్రకటించారు. ధరూర్ క్యాంపులో 27 ఎకరాల్లో మెడికల్ కాలేజీకి స్థలం కేటాయించారు. కళాశాలకు అనుబంధంగా 330 బెడ్స్ దవాఖానకు మంజూరు చేసి తాత్కాలిక భవనంలో ప్రారంభించారు. రెండెకరాల్లో మెడికల్ కాలేజీ, అరెకరంలో విద్యార్థుల క్యాంపస్, మరో అరెకరంలో బాలుర క్యాంపస్, దాదాపు నాలుగు ఎకరాల్లో అనుబంధ సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం చేపట్టనున్నారు.