ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మేడారం సమ్మక్క, సారక్క తల్లులకు తులాభారం మొక్కు తీర్చుకున్న సంగతి తెలిసిందే. శనివారం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కూడా నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించుకున్నారు. దీంతో కేసీఆర్, ఈటల శరీర బరువులను పోలిస్తూ రాజకీయ వర్గాల్లో సరదా ముచ్చట్లు సాగుతున్నాయి. సీఎం కంటే ఈటలే ఎక్కువ బరువు తూగారు. ఈటల వెయిట్ ఎక్కువని, అయితే నాయకత్వ, జనాదరణ వెయిట్లో సీఎంకు ఎవరూ సరితూగలేరని అంటున్నారు.కేసీఆర్ బరువు 52 కేజీలు, ఈటల బరువు 59 కేజీలుగా బెల్లంతో లెక్క తేలింది. మరోపక్క ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 83 కేజీల బరువు తూగారు. ఆయన వెయిట్ ఎక్కవ కావడం వల్లే బీజేపీ ఆయనను పెద్దల కుర్చీలో కూర్చోబెట్టిందని నెటిజన్లు జోకుతున్నారు.
కాగా, మేడారం జాతరలో ఈటల విలేకర్లో మాట్లాడుతూ.. సమ్మక్క, సారక్కలు తమ జాతివారి ప్రయోజనాల కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీరవనితలు అని కొనియాడారు. వారి పోరాటం యువతకు స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. ‘కోట్లాదిమంది మొక్కులు అందుకున్న వనదేవతలను తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్న. ఇక్కడికి వస్తున్న భక్తులకోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చారు.. వాటన్నిటినీ సరిపోయెన్ని డబ్బులు కేటాయించుకొని ఏర్పాట్లు చేస్తాం..’ అని తెలిపారు.