CM KCR order to form another new mandal
mictv telugu

నూతన మండలంగా ‘ఇనుగుర్తి’.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్

July 25, 2022

మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ‘ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇనుగుర్తిని మండలం చేయాలని చాలా కాలంగా అక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయడానికి ఉన్నఅర్హతలు.. చారిత్రక నేపథ్యాన్ని.. ఆ గ్రామానికి చెందిన రాజ్యసభ స‌భ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కెసీఆర్ ను కలిసి వివ‌రించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎంపీ ఎమ్మెల్యేలను సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించుకుని దీనిపై చర్చించారు. అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధుల దీర్ఘకాలిక కోరిక మేరకు ముఖ్యమంత్రి ఇనుగుర్తిని మండలంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ప్రస్తుతం కేసముద్రం మండలంలో భాగంగా ఉన్న ఇనుగుర్తి కొత్త మండలంగా ఏర్పడనుంది. మహబూబాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం 16 మండలాలు ఉన్నాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇనుగుర్తి మండలం ఏర్పాటుకు సీఎం ఆదేశాలు ఇవ్వడంతో ఆ జాబితాలో మరో మండలం చేరనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 594మండలాలు ఉండగా.. కొత్త వాటితో కలుపుకొంటే ఆ సంఖ్య 608కి చేరనుంది.