సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్స్ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. భేటీ సందర్బంగా బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. ఇందుకు తగినట్టు మంత్రులు కార్యచరణను రూపొందిచనున్నారు. ఫిబ్రవరి 10 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. పదోన్నతుల తర్వాత బదిలీలు ఉండొచ్చని సమాచారం.
గత కొంతకాలంగా పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో ఉందని చెప్పారు. కొన్ని న్యాయపరమైన చిక్కుల కారణంగా బదిలీలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను ముఖ్యమంత్రికి తెలుసునని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా విద్యను పిల్లల ఇంటి వద్దకు తీసుకెళ్లడంలో ఉపాధ్యాయులు అద్భుతమైన కృషి చేశారని అభినందించారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.