రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్.. వరద నీటిపై ఆరా
రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం సీఎం కేసీఆర్‌కు అలావాటు. స్వతహాగా ఆయన రైతు కావడంతో సాగులో కష్ట నష్టాలను అంచనా వేయగలరు. అందుకే నేరుగా రైతులకు ఏం చేయాలన్నా ఆయనే స్వయంగా పలకరిస్తారు. అలాగే మరోసారి ఓ రైతుకు ఫోన్ చేసిన ఆయన వరద నీరు.. పంటల సాగుపై ఆరా తీశారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొనుకటి లచ్చిరెడ్డికి సీఎం ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే కేసీఆర్ లైన్లోకి వచ్చి బాగున్నావా లచ్చిరెడ్డి అంటూ పలకరించాడు. అనుకోని అతిథిలా ఫోన్ చేసిన కేసీఆర్‌తో రైతు మాట్లాడాడు. ఎక్కడ ఉన్నావని ఆరా తీయగా తాను పోలంలో నాట్లు వేయిస్తున్నాని చెప్పారు. వెంటనే శాభాష్‌పల్లి వంతెన వద్దకు వెళ్లి తనకు వీడియో కాల్ చేయాలని కోరారు. లచ్చిరెడ్డి అక్కడికి వెళ్లి సీఎంకు ఫోన్ చేశాడు.
ఈ సందర్భంగా రామడుగు మండలంలోని గాయత్రి పంపుహౌస్ నుంచి వరదకాలువ ద్వారా వస్తున్న గోదావరి జలాలపై ఆరా తీశారు. ‘వరద నీరు వల్ల ఏమన్నా పాయిదా ఉందా. రైతులు ఏమంటున్నారు. పంటలు వేస్తున్నారా’ అని తెలుసుకున్నారు. దీనికి లచ్చిరెడ్డి ‘మీ కృషి వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు. వరద నీరు మా పంట పొలాలకు చేరడంతో నాట్లు మొదలుపెటామని చెప్పారు’. వరద పరిస్థితిని వీడియో కాల్ ద్వారా సీఎం కేసీఆర్ పరిశీలించారు. సాగునీరు ఇవ్వడంతో పాటు అవి పొలాలకు చేరాయో లేదో తెలుసుకునేందుకు నేరుగా సీఎం ఫోన్ చేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.