వర్షాలపై కేసీఆర్ సమీక్ష.. ఆ రెండు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని.. - MicTv.in - Telugu News
mictv telugu

వర్షాలపై కేసీఆర్ సమీక్ష.. ఆ రెండు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని..

August 15, 2020

CM KCR puts Telangana State administration on alert

గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో వాగులు, మత్తళ్లు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. ఆయా జిల్లాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్న కేసీఆర్.. హైదరాబాద్‌లో రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని తెలిపారు. 

స్థానిక కలెక్టర్, పోలీస్ అధికారులతో కలిసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. ‘రాష్ట్రవ్యాప్తంగా చాలా చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. దీంతో కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉంది. వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఎదురవ్వొచ్చు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అక్కడ దాదాపు అన్ని చెరువులు అలుగు పోస్తున్నాయి. ఆ రెండు జిల్లాల్లో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది’ అని కేసీఆర్ అధికారులకు సూచించారు. కాగా, సీఎం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రెండు హెలికాఫ్టర్లను సిద్ధంగా ఉంచింది. వరదల వల్ల చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వాటిని వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాఫ్టర్‌తో పాటు సైనిక హెలికాఫ్టర్‌ను కూడా అందుబాటులో ఉంచారు.