CM KCR Said Officials Stay Alert Heavy Rains
mictv telugu

అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి.. సీఎం కేసీఆర్

July 9, 2022

CM KCR Said Officials Stay Alert Heavy Rains

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేయాలన్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తుంటానని, పరిస్థితులనుబట్టి నేడో రేపో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానని పేర్కొన్నారు.

జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సహాయపడాలని, నష్టం జరగకుండా చూసుకోవాలని ప్రజాప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. భారీ వానలు వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్క్‌ తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన రెవెన్యూ సదస్సులను వాయిదా వేశారు. ఈ నెల 11న ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో నిర్వహించ తలపెట్టిన అవగాహనా సమావేశంతో పాటు రెవెన్యూ సదస్సులను మరో తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీఎం తెలిపారు.