తెలంగాణలో ఏ మూలైనా నాదే.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో ఏ మూలైనా నాదే.. కేసీఆర్

October 26, 2019

హుజూర్‌నగర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి గుర్తుగా ఈ రోజు నిర్వహించిన ప్రజా కృతజ్ఞత  సభలో ఆయన పాల్గొన్నారు. ఘన విజయం అందించిన ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షల కేటాయించనున్నట్టు ప్రకటించారు. మండల కేంద్రాలకు రూ. 30 లక్షలు ఇస్తామని,  సీఎం ప్రత్యేక నిధి నుంచి వీటిని విడుదల చేస్తామన్నారు.  

హుజూర్ నగర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు నేరేడుచర్ల మున్సిపాల్టీకి రూ. 15 కోట్లు కేటాయిస్తామన్నారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని.. త్వరలోనే వాటిని బాగుచేస్తామని చెప్పారు.లంబాడాలకు రెసిడెన్సియల్ స్కూల్, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నియోజకవర్గానికి ఈఎస్ఐ హాస్పిటల్ రప్పిస్తామన్నారు.సైదిరెడ్డి నాయకత్వంలోనే హుజూర్‌నగర్ అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో ఉన్న పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

తెలంగాణలో ఏమూలైనా నాదే : కేసీఆర్

రాష్ట్రంలో ఏ మూల అయినా తనదేనని చెప్పారు సీఎం కేసీఆర్. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజా మద్దతుతో ముందుకువెళ్తున్నామని అన్నారు. గోదావరి నీటిని నాగార్జున లెఫ్ట్ కెనాలకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన లిఫ్ట్‌లు, కాలువల ద్వారా తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశామలం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఏ మూల నీరు రాకున్నా ఆ బాధ్యత తానే తీసుకుంటానని తెలిపారు.