CM KCR started virtual classes in 8 new medical colleges simultaneously
mictv telugu

ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్.. ఇదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం కేసీఆర్

November 15, 2022

తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు సీఎం కేసీఆర్. నేడు (మంగళవారం) ఆన్‌లైన్ ద్వారా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల క్లాసులను సీఎం కేసీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, రామగుండం వైద్య కళాశాలల్లో 2022-23 వైద్యవిద్య సంవత్సరం నుంచే ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమైనట్లు అయింది. వీటి ద్వారా 1,150 సీట్లు విద్యార్థులకు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 17కి చేరింది.

ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో ఇది సరికొత్త చరిత్ర. దేశానికే తెలంగాణ ఆదర్శం కాబోతుందని కొనియాడారు. తెలంగాణకు ఇది సువర్ణాధ్యాయమని.. మరిచిపోలేని రోజు అని చెప్పారు. వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నచోట నష్టం తక్కువగా ఉంటుంది. కొవిడ్‌ లాంటి మహమ్మారులు, ఇతర వైరస్‌ల బెడద రాకూడదు. వైద్య విద్యార్థులతో రాష్ట్రానికి వైద్య కవచం నిర్మించుకుంటున్నామని కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్‌, వనపర్తిలాంటి మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ వస్తాయని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. దీనికి కారణం సొంత రాష్ట్రం ఏర్పాటు. ఉద్యమకారులుగా ఉన్నవారే పరిపాలనా సారథ్యాన్ని స్వీకరించడం.. అందులో ప్రముఖ ఉద్యమకారుడు హరీశ్‌రావు వైద్యఆరోగ్యశాఖ నిర్వహించడమే కారణం. వైద్యకళాశాలల ఏర్పాటు విషయంలో మంత్రి హరీశ్‌ కృషిని అభినందిస్తున్నానని తెలిపారు కేసీఆర్.