CM KCR Super Check To BJP..As EarlyPolls?
mictv telugu

బీజేపీకి కేసీఆర్ ముందస్తు చెక్..!

November 15, 2022

 

తెలంగాణ బీజేపీ అస్త్రం ఉప ఎన్నికలు. రేసులో ఉన్నామని చెప్పటానికి బైపోల్స్ పై బోలెడు ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పే ప్రయత్నం చేస్తోంది. దుబ్బాక నుంచి మొదలుపెట్టి మునుగోడుదాకా కమలం కత్తులు దూసింది. భవిష్యత్‌కు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. కానీ బీజేపీని దెబ్బతీసేందుకు కేసీఆర్ వ్యూహాల్ని రచిస్తున్నారు. ముందస్తుతో చెక్ పెట్టే దిశగా ఆలోచనలు సాగుతున్నాయని తెలుస్తోంది. బీజేపీ ఉప ఎన్నికల అస్త్రాల్ని కేసీఆర్ అడ్డుకోబోతున్నారా?మందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి?

ఉపఎన్నికల అస్త్రం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2023 నవంబర్‌లో జరుగుతాయి. ముందస్తు ముచ్చటే లేదు…షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. పార్టీ నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయినా ముందుస్తు ముచ్చట తెరపైకి వస్తూనే ఉంది. టీఆర్ఎస్ ఖండిస్తూనే ఉంది. 2023 పై టీఆర్ఎస్ నజర్ పెడితే..ఉప ఎన్నికలపై వ్యూహాన్ని తెలంగాణ బీజేపీ తెరపైకి వస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌ని స్పీడప్ చేసి మరో ఉప ఎన్నికను తేవాలని చూస్తుంది. ఈసారి ఒక్కటి కాకుండా మూడు, నాలుగు స్థానాల్లో ఎన్నికలుండేలా అడుగులు వేస్తోంది. అంతేకాదు ఈ స్థానాల్లో టీఆర్ఎస్‌కు గట్టి షాక్ ఇచ్చి..ఫైనల్‌కు ప్రిపేర్ కావాలని యోచిస్తోంది.

ముందస్తు వ్యూహం
ఉపఎన్నికలకు ఉ అంటారా..ఊఊ అంటారా అని రెచ్చగొడుతున్న బీజేపీకి సీఎం కేసీఆర్ గట్టి షాక్ ఇవ్వబోతున్నారు. ఉపఎన్నికలకు అవకాశమే లేకుండా చేయబోతున్నారు.ఇందులో భాగంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకావం ఉందని తెలుస్తోంది. ఎలాగూ ఇప్పటికిప్పుడు బీజేపీ ఉప ఎన్నిక తేదు. ఎవరినైనా రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలన్నా 2, 3నెలలు పడుతుంది. ఆ తర్వాత ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేవరకు మరో నెల, రెండునెలలు కచ్చితంగా పడుతుంది. ఉపఎన్నిక ఏరికోరి బీజేపీ తెచ్చినా ఆరు నెలలు పడుతోంది. అందుకే సరిగ్గా ఆరు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందుస్తుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఆరునెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి.రాష్ట్రపతి పాలన విధించే అవకాశమూ ఉండదు. ఎలాగూ షెడ్యూల్‌కు రెండు,మూడు నెలల ముందు ఎన్నికలు జరుగుతాయి. లేదంటే షెడ్యూల్ ప్రకారమే ఈసీ ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఉంది. కేసీఆర్ వ్యూహంతో బీజేపీకి చెక్ పడుతుంది. ఉప ఎన్నికల ప్రస్తావనే ఉండదు. ఇక డైరెక్ట్‌గా ఫైనల్ వారే. విపక్షాలకు సమయం ఉండదు. కేసీఆర్ నయా ప్లాన్‌తో టీఆర్ఎస్‌కు ప్లస్ అవుతుందని గులాబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అప్పట్లో కేసీఆర్
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అసలు సిసలైన ఆయుధం ఉపఎన్నికలు. ఉవ్వెత్తున ఎగిసిపడే ఉద్యమం కాస్త నెమ్మదించినప్పుడు ఉప ఎన్నికల అస్త్రాన్ని వదిలేవారు. తెలంగాణ ఉద్యమాన్ని దశ దిశను మార్చేవారు. కరీంనగర్ లోక్ సభ నుంచి మొదలైన ఈ తంతు తెలంగాణ వచ్చే ముందుదాకా సాగింది. చాలా సార్లు ఉద్యమానికి ఉపఎన్నికలు ఊపిరిపోశాయి. ఏపీ సర్కార్ పై తిరుగుబాటుని వేడి మీదే ఉంచేవి. సరిగ్గా ఇప్పుడు బీజేపీ కూడా కేసీఆర్ సర్కార్ పై ఉప ఎన్నికల అస్త్రాన్ని సంధిస్తోంది. రేసులో ఉండేందుకు బై పోల్ అస్త్రాన్ని బయటకు తీస్తుంది.

కాంగ్రెస్ సీన్‌లో లేకుండా…
ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్‌ను సీన్‌లోకి రాకుండా చూడటమే టీఆర్ఎస్ , బీజేపీల లక్ష్యం.అందుకే ఉప ఎన్నికలకు సై అంటే సై అంటున్నాయి. హుజూరాబాద్ ప్లాన్‌ని బీజేపీ వర్కౌట్ చేయాలని చూస్తుంటే..మునుగోడు వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేయాలని చూస్తోంది. కానీ ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ముందస్తుకు వెళ్లే అవకాశాలు చాలా వరకు ఉంటాయని తెలుస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ రేసులో లేకుండా ప్రయత్నాలు ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. పోటీ తమ మధ్యే అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి.