CM KCR to attend closing ceremony of I-Day celebrations at LB Stadium
mictv telugu

నేటితో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్

August 22, 2022

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సోమవారం ముగియనున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తెలంగాణకు చెందిన సమరయోధుల వారసులను, ఇటీవల పలు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను, ఇతర ప్రముఖులను ఈ సందర్భంగా సీఎం సన్మానించనున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శంకర్‌ మహదేవన్‌ కాన్సెర్ట్, శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజారెడ్డి బృందంతో క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్, వార్సి బ్రదర్స్‌ ఖవ్వాళీ, స్థానిక కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వజ్రోత్సవాలు పురస్కరించుకుని నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన ఉంటుంది. లేజర్‌ షోతో పాటు భారీఎత్తున బాణసంచా ప్రదర్శనలతో వజ్రోత్సవాలు ముగుస్తాయి. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు, ట్రస్టు బోర్డుల ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు అన్ని జిల్లాల నుంచి 30వేల మంది ప్రజలు హాజరుకానున్నారు. ముగింపు ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించారు.