BRS పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభ పక్షం, కార్యవర్గం సంయుక్త సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం జరగనుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్యవర్గ సభ్యులతోపాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లను సమావేశానికి ఆహ్వానించారు. ఈ ఏడాదే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనే విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కవితకు ఈడీ నోటీసుల ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
బీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేటివ్ పార్టీ మరియు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం మార్చి 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. pic.twitter.com/JkLbTNp73X
— BRS Party (@BRSparty) March 9, 2023
లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం, ఒక వేళ అరెస్టు చేస్తే చేపట్టబోయే ప్రణాళికల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అరెస్ట్ జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. రాష్ట్రంతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా కవిత అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు ఎలాంటి వ్యూహలు రచించాలనే దానిపై నేటి సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.