ధరణి రిజిస్ట్రేషన్లు దసరా నుంచి.. కేసీఆర్  - MicTv.in - Telugu News
mictv telugu

ధరణి రిజిస్ట్రేషన్లు దసరా నుంచి.. కేసీఆర్ 

September 26, 2020

CM KCR to launch Dharani on Dasara

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన, బిల్లలుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టం ఎప్పుడెప్పుడు అమల్లోకి వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ధరణి పోర్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ధరణి రిజిస్ట్రేషన్లు దసరా పండుగ రోజున ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపుగానే పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ధరణి పోర్టల్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, బ్యాండ్ విడ్త్‌లను సిద్ధం చేయాలని తెలిపారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్‌లో వివరాలను అప్‌డేట్ చేయడం తదితర అంశాలపై, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. 

కేసీఆర్ మాట్లాడుతూ.. ‘దసరా రోజున పోర్టల్ ప్రారంభిస్తున్నందున అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం అవుతాయి. ఈ లోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు కానీ జరగవు. డెమో ట్రయల్స్ కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలి. ప్రతి మండలానికి ఒకరు చొప్పున, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాన్ని పూర్తి చేయాలి. ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నాం. అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. తహశీల్దారు కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో డాక్యుమెంట్ రైటర్స్‌కు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నాం. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటా ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి. ఆ తర్వాత జరిగే మార్పులు చేర్పులు వెంటవెంటనే నమోదు చేయాలి’ అని కేసీఆర్ వెల్లడించారు.