ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం మహబూబాబాద్, మధ్యాహ్నం కొత్తగూడెం జిల్లాల్లోని నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను.. ప్రారంభించనున్నారు. ఉదయం మానుకోటలో కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం.. మధ్యాహ్నం కొత్తగూడేనికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ ఉదయం 9.45 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా మానుకోటకు చేరుకోనున్న సీఎం కేసీఆర్.. 11:10 నిమిషాలకు.. అక్కడ నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 11.40 నిమిషాలకు మహబూబాబాద్ సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించి, పరిశీలించనున్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో 10 వేల మందితో నిర్వహించనున్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. 2018 ఏప్రిల్ 4న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ 20 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి పునాదిరాయి వేశారు.
మహబూబాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో.. కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లి.. కొత్తగూడెం-పాల్వంచ జాతీయ రహదారి పక్కనే ఆధునిక హంగులతో నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. మొత్తం 25.16 ఎకరాల విస్తీర్ణంలో రూ.44.98 కోట్లతో కొత్త కలెక్టరేట్ నిర్మించారు. 2018 ఏప్రిల్ 3న పురపాలకశాఖ మంత్రి కేసీఆర్, అప్పటి రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జీ ప్లస్ టూ పద్దతిలో నిర్మాణం చేపట్టారు. కొత్త కలెక్టరేట్లో 46 ప్రభుత్వ శాఖలు కొలువు దీరనున్నాయి. బహిరంగ సభ తర్వాత కొత్తగూడెంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత కేసీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరి రానున్నారు.