కర్నాటకలో వాత పెట్టినా బుద్ధిరాలే.. కేసీఆర్ ధ్వజం
దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మట్టికరవడం ఖాయమని తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. ఒకప్పుడు ఎమర్జెన్సీని వ్యతిరేకించిన బీజేపీ ఇప్పుడు దేశాన్ని మరో ఎమర్జెన్సీ దిశగా తీసుకెళ్తోందని మండిపడ్డారు. ఆయన శనివారం హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్‌లతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ప్రజావ్యతిరేకమైన బీజేపీ పాలనకు చరమగీత పాడటానికి అందరూ చేతులు కలపాలని కోరారు.
రాష్ట్రాలపై కేంద్రం పెత్తానాన్ని అడ్డుకోవాల్సిన అవసరముందని కేసీఆర్ అన్నారు. ‘‘ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధిస్తోంది. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై ఆర్డినెన్స్ తీసుకురావడం అన్యాయం. ఇలాంటి విషయాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోకుండా ఆర్డినెన్స్ తెచ్చింది. ఆనాటి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ దిశగా బీజేపీ వెళ్తోంది. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. రాజ్‌భవన్‌లు తమ పనేమిటో చూసుకోకుండా బీజేపీ రాష్ట్ర కార్యాలయాలుగా మారాయి. గవర్నర్లు ఆ పార్టీ ప్రచారకర్తలుగా మారాయి’’ అని మండిపడ్డారు. కర్నాటక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి కర్రు కాల్చి వాతలు పెట్టిన బుద్ధిరాలేదని, రేపు దేశం కూడా అలాంటి తీర్పే ఇస్తుందని అన్నారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో ఆందోళన జరపడానికి మద్దతు కోసం కేజ్రీవాల్ విపక్ష నేతలను కలుస్తున్నారు. అందులో భాగంగా కేసీఆర్‌ను కలిశారు.