భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్రప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసైలు ఘన స్వాగతం పలికారు. మొట్టమొదటిసారి హైదరాబాదుకు శీతాకాల విడిది కోసం వచ్చిన ఆమెకు హకీంపేట్ విమానాశ్రయంలో కేసీఆర్ తో పాటు మంత్రులు, అధికారులు, మేయర్, త్రివిధ దళాధిపతులు స్వాగతం పలికారు. అంతకుముందు ఉదయం పది గంటల సమయంలో బేగం పేట విమానాశ్రయానికి భారత వాయుసేన విమానంలో వచ్చిన రాష్ట్రపతి.. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లో నేరుగా శ్రీశైలం వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి రాగా సాయంత్రం 5 గంటల సమయంలో హకీంపేట చేరుకున్నారు.
ముర్ము వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసైలు కూడా ఉన్నారు. తర్వాత యుద్ధవీరుల స్మారకం వద్ద నివాళులర్పించిన తర్వాత బొల్లారంలోని తన నివాసానికి చేరుకున్నారు. సోమవారం సాయంత్రం రాజ్ భవన్ లో గౌరవవార్ధం ఏర్పాటు చేసిన విందుకు రాష్ట్రపతి హాజరవుతారు. కాగా, ఈ నెల 30 వరకు బొల్లారంలో విడిది చేయనున్న ద్రౌపదీ ముర్ము.. ఈ ఐదు రోజుల సమయంలో భద్రాచలం, రామప్ప, యాదాద్రి ఆలయాలను సందర్శిస్తారు. దాంతోపాటు నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పైవాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. విద్యుత్, వైద్య సిబ్బందితో పాటు భద్రత కోసం 1500 మంది పోలీసులను నియమించింది.