CM KCR will inspect the works of thermal power plant at Damarachar today
mictv telugu

నేడు దామరచర్లకు సీఎం కేసీఆర్.. థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పరిశీలన

November 28, 2022

నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ప్లాంటు నిర్మాణపనులను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి దామరచర్ల పర్యటనకు బయల్దేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు. అనంతరం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సీఎం పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి.. సాయంత్రం హైదరాబాద్ కు ప్రయాణమవుతారు.

CM KCR To Visit Damaracharla, to Inspect Yadadri Thermal Plant In Nalgonda

దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి రాష్ట్రానికి వెలుగులు పంచనుంది. దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతి పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇది మొదటిది. ఒకే స్థలంలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం నిర్మాణ పనుల టెండరును భెల్‌ సంస్థ దక్కించుకుంది. మొత్తం రూ.29,992 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో చేపట్టిన ఈ కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం గల ప్లాంట్లు మొత్తం 5 ఉన్నాయి. ఇప్పటికే ప్లాంటులో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి.

సోమవారం ముఖ్యమంత్రి పరిశీలించనున్న నేపథ్యంలో అధికారుల హడావుడి నెలకొంది. ఈ క్రమంలో స్థానిక టీఎస్‌ జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌ అధికారులతో సీఎం సమావేశమై అక్కడ జరుగుతున్న పనులపై సలహాలు, సూచనలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, పర్యటనలో సీఎం కేసీఆర్‌తో పాటు జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. వీరు రెండు హెలికాప్టర్లలో ప్లాంటుకు వస్తున్నారని సమాచారం అందడంతో, ప్లాంటులో రెండు హెలిప్యాడ్‌లను అధికారులు సిద్ధం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆర్డీవో చెన్నయ్య, జెన్‌కో డైరెక్టర్‌ అజయ్‌, సీఈ సమ్మయ్య, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు తదితరులు ఆదివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు.